భారత ఆరోగ్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు ఆదర్శం: పల్లా శ్రీనివాసరావు

  • విశాఖలోని ప్రోటిజెనిక్స్ ప్లాంట్‌ను సందర్శించిన పల్లా
  • ఆరోగ్య రంగంలో సంస్థ సేవలు ఆదర్శనీయమని ప్రశంస
  • ప్రోటిజెనిక్స్ స్ఫూర్తితో స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు
  • సంస్థకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ
భారత ఆరోగ్య రంగ స్వావలంబనలో ప్రోటిజెనిక్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రశంసించారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు ప్రోటిజెనిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం విశాఖలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న ప్రోటిజెనిక్స్ ప్లాంట్‌ను ఆయన సందర్శించి, యాజమాన్యంతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. "అత్యవసరమైన ప్లాస్మా ఆధారిత ఔషధాల తయారీలో దేశీయ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రోటిజెనిక్స్ చేస్తున్న కృషి అభినందనీయం. ఆరోగ్య రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో ఇలాంటి సంస్థలే కీలకం" అని పేర్కొన్నారు. ప్లాస్మా ప్రోటీన్ థెరప్యూటిక్స్‌పై దృష్టి సారించిన ఏపీలోని తొలి సంస్థ ఇదేనని ఆయన గుర్తుచేశారు.

2021లో ఎన్నారై వైద్యుల బృందం స్థాపించిన ఈ సంస్థ.. ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబులిన్ (IVIG), హ్యూమన్ ఆల్బుమిన్, ఫ్యాక్టర్ VIII వంటి కీలక ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది. రోగనిరోధక లోపాలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రక్తస్రావ సమస్యల చికిత్సలో ఈ ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయి.

ప్రోటిజెనిక్స్ సంస్థను ఆదర్శంగా తీసుకుని ఎన్నారైలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పల్లా కోరారు. విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, ప్రజల ఆరోగ్య భద్రతకు తోడ్పడే ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Palla Srinivasa Rao
Protigenics Life Sciences
Visakhapatnam Healthcare
NRI Investments Andhra Pradesh
Plasma Protein Therapeutics
AP TDP President

More Telugu News